Sunday, July 19, 2009

సుందరకాండ - 3

శింశుపా వృక్షం ఎక్కిన హనుమంతుడు అక్కడి నుంచి చుట్టుపక్కలన్నీ
కలయ జూశాడు. అశోకవనం దేవేంద్రుడి నందన వనం లాగుంది. దాని నిండా
పూల చెట్లూ, పళ్ళ చెట్లూ ఉన్నాయి. పక్షులూ, మృగాలూ ఉన్నాయి. అక్కడక్కడా
దివ్యమైన భవనాలూ, అరుగులూ; తామర పూలూ, కలువపూలూ గల
మడుగులున్నాయి. అన్నిటికన్న అశోక వృక్షాలు జాస్తిగా ఉన్నాయి.
కొద్ది దూరంలో ఒక ఎత్తయిన తెల్లని మండపం ప్రకాశిస్తున్నది.
అందులో వెయ్యి స్తంభాలున్నాయి. దానిలో పగడాలతో తయూరు చేసిన మెట్లూ,
బంగారు అరుగులూ ఉన్నాయి. అది ఒక చైత్యం ఆకారంలో ఉన్నది. తరవాత
హనుమంతుడికి సీత కనిపించింది. ఆమె ధరించిన చీర మట్టి కొట్టుకుని ఉన్నది.
ఆమె చుట్టూ రాక్షస స్ర్తీలున్నారు. ఆమె బాగా కృశించి, నిట్టూర్పులు విడుస్తూ,
దైన్యంతో కూడుకుని ఉన్నది. దేహ సంస్కారం లేక ఆమె శరీరం కూడా మట్టి కొట్టుకుని
ఉన్నది.నగలు చాలా కొద్దిగా ఉన్నాయి. ఆమె జుట్టు ఒకే జడలాగా అట్టకట్టుకుపోయి
తుంటి దాకా వేళ్ళాడుతున్నది. ఈమె సీత అయి ఉండాలని హనుమంతుడు
ఈ విధంగా వితర్కించుకున్నాడు: రావణాసురుడు ఎత్తుకు పోయేటప్పుడు
ఆ స్ర్తీలో తనకూ, సుగ్రీవాదులకూ కనిపించిన పోలికలు ఈమెలో కొన్ని ఉన్నాయి.
నిండు చంద్రుడి వంటి ముఖం. తీర్చినట్టుండే కనుబొమలు, నల్లని వెంట్రుకలు,
అందమైన నడుము-సీత ఎంత కృశించి, శోక సముద్రంలో మునిగి ఉన్నా ఈ
లక్షణాలు దాగటం లేదు.

No comments:

Post a Comment