Saturday, July 18, 2009

సుందరకాండ - 2

నూరామడల దూరం దూకినా కూడా హనుమంతుడికి ఆయూసం కలగలేదు. ఆఖరుకు ఊపిరి కూడా వేగంగా పీల్చలేదు. అందుచేత అతను, ‘‘నేను ఎన్ని నూరామడలైనా దూక గలను. ఈ సముద్రం దాటటం ఏపాటి?'' అనుకున్నాడు. అతను పచ్చిక భూముల మీదుగా, చిన్న పెద్ద కొండలు గల అరణ్యాలమధ్యగా లంకానగరం కేసి నడవసాగాడు. లంకాపట్టణం చుట్టూ సరళ చెట్లూ, కొండగోగులూ, ఖర్జూరాలూ, జంబీరాలూ, కొండ మల్లెలూ, మొగలి పొదలూ, అరటులూ మొదలైన ఎన్నో రకాల చెట్లున్నాయి. అందమైన ఉద్యానాలున్నాయి. నగరం చుట్టూ బంగారు ప్రాకారాలున్నాయి, అగడ్తలున్నాయి. ఎవరూ లోపల ప్రవేశించకుండా భయంకరులైన రాక్షసులు ఆయుధాలతో కాపలా కాస్తున్నారు. లెక్కలేని కోట బురుజులతోనూ, ధ్వజస్తంభాలతోనూ, ప్రకాశిస్తున్న ఇళ్ళతోనూ అతి మనోహరంగా ఉన్న లంకానగరం ఎత్తున ఉండటం చేత నిజంగానే దేవలోకానికి సంబంధించినట్టుగా ఉన్నది. లంకానగరమూ, దానికి గల రక్షణలూ, రాక్షసుల కాపలా చూస్తూ ఉంటే హనుమంతుడికొక ఆలోచన కలిగింది: వానరులు సముద్రం దాటి ఈ లంకకు ఎలా వస్తారు? నూరు యోజనాల సముద్రాన్ని లంఘించగల వానర వీరులలో హనుమంతుడు గాక, అంగదుడూ, నీలుడూ, సుగ్రీవుడూ మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళ మాటేమిటి? మహా వీరుడైనప్పటికీ రాముడిక్కడికి వచ్చి ఈ లంకను జయించగలడా అని హనుమంతుడికి అనుమానం కలిగింది.


No comments:

Post a Comment